మంత్రివర్గ విస్తరణ కోసం ఏర్పాట్లుpolitical news


ఈనాడు, హైదరాబాద్‌ : మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సామాజిక సమీకరణాలపై దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా కసరత్తు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యుల జాబితాపై రెండు రోజులుగా అధ్యయనం చేస్తున్నారు. గత మంత్రివర్గంలో 18 స్థానాలకు గాను 11 ఓసీలు, నాలుగు బీసీలు, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలలో ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. ఈసారి కూర్పులో ఎలాంటి ప్రామాణికాలను పాటించాలనే అంశంపై ఆయన ఆలోచిస్తున్నారు. గత నెల 13న మంత్రివర్గ ఏర్పాటు సమయంలో సీఎం, మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్‌అలీతో ప్రమాణ స్వీకారం చేశారు. మైనారిటీ కోటా భర్తీ అయినట్లే. ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాతో పాటు మహిళా కోటా కూడా భర్తీ కావాల్సి ఉంది. ఈ నెల 18న జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గ విస్తరణలో మరో ఎనిమిది మందిని తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ దఫాలోనే ఎస్సీ,ఎస్టీ,మహిళా కోటాతో పాటు బీసీ కోటా కింద మంత్రుల నియామకం ఖాయమంటున్నారు. ఎస్సీ,ఎస్టీ, మహిళా కోటాలో ఒక్కొక్కరికి, బీసీ కోటాలో మాత్రం ఇద్దరికి అవకాశం వస్తుందని, మిగిలిన మూడు స్థానాలు ఓసీలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తెరాస తరఫున 88 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. అనంతరం ఇద్దరు స్వతంత్రులు చేరడంతో పార్టీ బలం 90కు చేరుకుంది. ఈ ఎమ్మెల్యేల్లో బీసీలు 20 మంది, ఎస్సీలు 16 మంది, ఎస్టీలు అయిదుగురు, ఒక మైనారిటీ, మహిళలు ముగ్గురు(ఓసీ ఇద్దరు, ఎస్టీ ఒక్కరు)న్నారు.

పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టండి: కేసీఆర్‌

‘మంత్రివర్గ విస్తరణ నాకు వదిలేయండి.. మంత్రి పదవుల కోసం మీరు ఎవరూ నియోజకవర్గాలను వదిలి ఇక్కడికి రావద్దు. పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఆది, సోమవారం కొంత మంది శాసనసభ్యులు ఆయనను కలిసినప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. తన వద్దకు కొంత మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వారి సమస్యలు గురించి సీఎం ఆరా తీస్తున్నారు. ముఖ్యమైన అంశాలుంటే వారితో చర్చిస్తున్నారు. మర్యాదపూర్వకంగా భేటీకి వచ్చిన వారితో పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడి... నేరుగా నియోజకవర్గాలకు వెళ్లాలని సూచిస్తున్నారని తెలిసింది. పంచాయతీ ఎన్నికలు చాలా కీలకమైనవని, మొత్తం అన్ని స్థానాల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కృషి చేయాలని చెబుతున్నారు.

సాధారణ పరిపాలన శాఖకు ప్రభుత్వ ఆదేశాలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కోసం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖకు సూచించింది. ఈ నెల మూడో వారంలో విస్తరణకు అవకాశం ఉందని పేర్కొంటూ దీనికి అనుగుణంగా సన్నద్ధం కావాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతున్నా దీనికి ఏర్పాట్లు జీఏడీనే నిర్వహిస్తుంది. వేదిక, ప్రాంగణ అలంకారం, ఆహ్వాన పత్రికలను ముద్రించి పంపిణీ చేయడం వంటివి జీఏడీ ద్వారానే జరుగుతాయి. మంత్రివర్గ విస్తరణ ఈ నెల 18న జరుగుతుందనే సంకేతాల నేపథ్యంలో దీనికి అనుగుణంగా ప్రభుత్వం జీఏడీకి సూచనలు ఇచ్చినట్లుగా సమాచారం.

political news
Hariyan Srinivas
political news
Jan 08, 2018
political news
Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...