మా నాన్నగారి అదృష్టం మా అమ్మ: బాలకృష్ణ ‌political news


నిమ్మకూరు‌: కృష్టా జిల్లాలోని నిమ్మకూరులో తన తల్లిదండ్రులు ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. బాలయ్యతోపాటు ‘యన్‌.టి.ఆర్‌’ చిత్ర దర్శకుడు క్రిష్‌, నటి విద్యాబాలన్‌, నటుడు కల్యాణ్‌రామ్‌ తదితరులు ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నిమ్మకూరు చేరుకున్నారు. ఎన్టీఆర్‌, బసవతారకం దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరికి నిమ్మకూరు వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. ‘యన్‌.టి.ఆర్‌’ సినిమా గురించి ముచ్చటించారు.

ఇది ఓ సంకల్పం

‘నాన్న గారి బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌-కథానాయకుడు’ ఆడియో వేడుకను నిమ్మకూరులో ఏర్పాటు చేద్దామనుకున్నాం. కానీ అప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో హైదరాబాద్‌లోనే నిర్వహించాం. ఇప్పుడు సినిమా విడుదలకు ముందు మా బంధువులు, అందర్నీ కలుసుకుని అమ్మానాన్నల ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చాం’ అన్నారు.

‘ఈ బయోపిక్‌ ఒక పార్టీకి, ఒక వర్గానికి పరిమితం కాదు. అందరూ ఆదరించే నాయకుడు ఎన్టీఆర్‌. అందుకే ఆయన్ని మహానాయకుడు అంటుంటారు. వారికి మరణం, పుట్టుకలు ఉండవు. అలాంటి వ్యక్తి కొడుకుగా ఆయన పాత్ర చేయడం గొప్పగా భావిస్తున్నా. రెండు భాగాల్ని ఇంత త్వరగా తీయడం విశేషం. రెండో భాగానికి సంబంధించి మరో పది రోజుల షూటింగ్‌ ఉంది. దర్శకుడు క్రిష్ నాతో ఇంతకు ముందు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చేశారు. మన ప్రాచీన తెలుగు చరిత్ర సృష్టికర్త గౌతమిపుత్ర శాతకర్ణి అయితే.. మన ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త తారక రామారావు గారు. ఆయన జీవిత కథను సినిమాగా తీయడం అనేది ఓ సంకల్పం’.

నాన్న అదృష్టం అమ్మ

‘ఇక్కడికి వచ్చాక ఏదో తెలియని అనుభవం తనకు కలిగిందని ఇప్పుడే నాతో విద్యా బాలన్‌ అన్నారు. ఆమె అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు. నాన్న సినిమాల్లో మంచి సందేశం ఉంటుంది. మహిళల్ని ప్రోత్సహించేలా ఉంటాయి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అంటారు. అలా మా నాన్న అదృష్టం మా అమ్మ. వారిద్దరి మధ్య నడిచే కథే ఈ బయోపిక్‌’.

అన్నయ్య గుర్తొస్తున్నారు

‘నాన్న చేసిన పాత్రలు పోషించాలనే కోరిక ఉండేది. ఈ సినిమా కోసం వాటిలో కొన్ని చేశా. ఇవాళ మా అమ్మానాన్నే కాదు.. మా అన్నయ్య హరికృష్ణ కూడా గుర్తొస్తున్నారు. ఆయన ఇక్కడే మా తాత దగ్గర పదిహేడు సంవత్సరాలు పెరిగారు. అన్నయ్య ముక్కుసూటి వ్యక్తి, అనుకున్నది సాధించే వరకూ మరొకరి మాట వినరు. తెదేపా కోసం చాలా కష్టపడ్డారు’.

దేవుడిచ్చిన వరం

‘ఈ బయోపిక్‌లో నటించే అవకాశం నాకు లభించడం దేవుడిచ్చిన వరం. తండ్రి పాత్రను ఆవిష్కరించే అదృష్టం నాకు వరించడం పూర్వజన్మ సుకృతం. ఈ సినిమా ఇంత తొందరగా పూర్తి కావడానికి కారణమైన చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. నేను ఈ సినిమా అనుకున్నప్పుడు కుటుంబంలో అందరితో మాట్లాడా. వారితో చర్చించా. తరతరాలకు రామారావు గారు గుర్తుండిపోవాలి. ఇప్పుడు మనం మన సంప్రదాయాల్ని, సంస్కృతుల్ని విస్మరిస్తున్నాం. మరుగున పడి ఉన్న వాటికి మళ్లీ పదునుపెట్టి అందరికీ అందించే ప్రయత్నమే ఈ ‘యన్‌.టి.ఆర్‌’. అందరి కలయికే ఈ సినిమా’ అని బాలయ్య చెప్పారు.

political news
Hariyan Srinivas
political news
Jan 07, 2018
political news
Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...