టీఆర్ ఎస్ పార్టీ హామీ అమలు జూన్ 2 వ తేదీ నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు సమాచారం.political news


ఎదిగిన కొడుకు ఎలాంటి సంపాదన లేకుండా.. ఉద్యోగాన్వేషణలోనే ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. చదువు పూర్తై ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించాల్సిన దశలో ఉద్యోగ దరఖాస్తులకు - చిన్నచిన్న ఖర్చులకు సైతం తల్లిదండ్రులను డబ్బు అడిగే పరిస్థితి రావడం ఎంత ఇబ్బందికరమో దానిని అనుభవిస్తున్న వారికే బాగా తెలుసు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు రాజకీయ పార్టీలు తెచ్చిందే నిరుద్యోగ భృతి. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిరుద్యోగ భృతి కీలక హామీగా నిలిచింది. అలాంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ పార్టీ హామీ అమలుకు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 2 వ తేదీ నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు సమాచారం.

తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇవ్వనున్నట్లు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిరుద్యోగులకు నెలకు రూ.3016 భృతి ఇస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన టీఆర్ ఎస్ పార్టీ ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై దృష్టిసారించింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల లెక్కలు తీసినట్లు సమాచారం. ఉపాధి కల్పన కార్యాలయాల్లో డాటాతో పాటు వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా దాదాపు పది లక్షలమంది నిరుద్యోగులుంటారని ప్రభుత్వం లెక్క వేసింది. ఇదే సమయంలో ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల తీరును అధ్యయనం చేసినట్లు సమాచారం. నిరుద్యోగ భృతి అమలు చేస్తున్న ఏడు రాష్ట్రాల నుంచి ఇప్పటికే అధికారులు ప్రాథమిక సమాచారం తెప్పించుకున్నట్టు తెలిసింది. ఛత్తీస్ గఢ్ లో 12వ తరగతి పాసై - ఏడాదికి రూ.2 లక్షలలోపు కుటుంబ ఆదాయం ఉన్న 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు భృతి నెలకు రూ.1000 - దివ్యాంగ నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఇస్తున్నది. హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు ఇవే నిబంధనలున్నా.. వయో పరిమితి 20-35 ఏళ్లుగా ఉంది. కేరళలో నెలకు రూ.120 భృతి ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ లో నెలకు రూ.1000 - వారు దివ్యాంగులైతే రూ. 1500 ఇస్తున్నారు. రాజస్థాన్ లో నిరుద్యోగులకు నెలకు రూ.650 - మహిళలైతే నెలకు రూ.750 ఇస్తున్నారు. ఏపీలో 22-35 ఏళ్ల మధ్య వయసుండి - డిగ్రీ లేదా డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.1000 భృతి ఇస్తున్నారు. హర్యానాలో వార్షికాదాయం రెండు లక్షల వరకు ఉండి - 35 ఏళ్లలోపు ఉన్న ఎస్సెస్సీ ఉత్తీర్ణులైన వారికి నెలకు రూ.100 - 12వ తరగతి పాసైన వారికి నెలకు రూ.900 - డిగ్రీ వారికి రూ.1500 - పీజీ వారికి 3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. వీటన్నింటిపై అధ్యయనం చేసి - తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా సమగ్రమైన విధానం రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయారు.

ప్రాథమికంగా రూపొందించిన నిబంధనల ప్రకారం 18-35 ఏళ్ల మధ్య వయసు కలిగి - చదువుకోకుండా - చేయడానికి పనిలేకుండా ఉన్నవారినే నిరుద్యోగులుగా గుర్తించనున్నారని తెలుస్తోంది. వయోపరిమితిలో వెసులుబాటు కల్పించడంపైనా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. పదో తరగతి పాసైన విద్యార్థులు ఎంతమంది చదువు మానేశారు? ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎంతమంది చదువు ఆపేశారు? ఎంతమంది ప్రభుత్వ - ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు? పీజీ ఎంతమంది చదువుతున్నారు? రిసెర్చ్ స్కాలర్లుగా ఎంతమంది ఉన్నారు? విదేశాలకు ఎంతమంది వెళ్లి చదువుకుంటున్నారు? తదితర అంశాలు కొలమానాలుగా నిరుద్యోగుల లెక్క తేల్చాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం పక్కదారి పట్టకుండా - అమలుకు కొంత వెసులుబాటు తీసుకునైనా సరే.. పక్కాగా అమలుచేయాలని సర్కారు పెద్దలు భావిస్తున్నారు. ఇందుకోసం నిరుద్యోగుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలా? ఉపాధికల్పన కేంద్రాల్లో పేర్లను రిజిస్టర్ చేయించాలా? అనే అంశాలపై సమాలోచనలు సాగుతున్నాయి. జిల్లాస్థాయిలో నిరుద్యోగుల జాబితాను ఫైనల్ చేసేలా మార్గదర్శకాలు రూపొందించే అంశంపైనా కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఈ పథకానికి దరఖాస్తుచేసి లబ్ధిపొందితే తీవ్ర నేరంగా పరిగణిస్తారని సమాచారం. అలాంటివారిని గుర్తించేందుకు ఏర్పాట్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 2 వ తేదీ నుంచే నిరుద్యోగ భృతి అందిస్తారని సమాచారం.

political news
Hariyan Srinivas
political news
Jan 05, 2018
political news
Political News


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...